4, జులై 2012, బుధవారం


               మనం భారతీయులం. మనది ఒకే కుటుంబం. ఈ గాలి పీల్చినవారు, ఈ నీరు తాగినవారు, తరతరాలుగా ఈ నేలపై నివసిస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారందరూ అదృష్టవంతులే. ఎందుకంటే ప్రపంచంలో ఇంత సహనం ఉన్న దేశం మరొకటి లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులకూ, వారికీ ఈ గడ్డపై జన్మనిచ్చిన భరతమాతకు కృతజ్ఞతలు. మొహమాటపడకుండా ఒక విషయం సూటిగా చెప్పుకుందాం. మన ముందు తరం వారు ఈ దేశ భవిష్యత్తును, అంటే తమ తర్వాత తమ పిల్లలు బతికే సమాజాన్ని గురించి పట్టించుకునే అవకాశం లేకపోయింది. తమ పిల్లలను సమాజంలో నిస్వార్ధంగా, నిజాయితీగా, హుందాగా, పక్కవాడితో, తోటివాడితో స్నేహంగా, ప్రేమగా ఉండేలా, ఎదుటివారికి సాయపడేలా అందరు తల్లిదండ్రులూ తీర్చిదిద్దలేకపోయారు. ఎందుకంటే మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు పాటించి, ఆచరించిన సంస్కృతిని మనం అవమానిస్తున్నాం. అవహేళన చేస్తున్నాం. మంచి విషయాలను ఆచరించే  క్రమంలో ఈ కాలపు పెద్దలు మనకు తగిన శిక్షణ ఇవ్వడంలేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. మనం నిత్యం ఎన్నో వినకూడని వార్తలు వింటున్నాం, చదువుతున్నాం, అసహ్యించు కుంటున్నాం. అంటే ఎవరో ఒకరు చేసిన పనిని మనం నిందిస్తున్నాం. ఆ సంఘటన జరిగిన పరిస్థితి ఏర్పడడానికి గల కారణాలను సహృదయంతో విమర్శిస్తున్నాం. ఇలా కాకుండా ఉంటే ఎంత బాగుణ్ణు అని ఆక్రోశిస్తున్నాం... దీనంతటికీ కారణం ఎవరో ఒకరు కన్నబిడ్డలు చేస్తున్న పనులే. ఒక క్రమపద్ధతిలో పెరగని పిల్లలే కారణం. ఈ మాట అన్నందుకు బిడ్డల తల్లిదండ్రులందరూ క్షమించండి. పిల్లలను సక్రమంగా, సరైన మార్గంలో పెంచలేకపోవడానికి అప్పటి పరిస్థితులు వారికి సహకరించి ఉండకపోవచ్చు. ఇలాంటి దుస్థితిని మనం రాబోయే తరాలవారికి కల్పించొద్దు. అందుకు ఏమైనా చేద్దాం. ఏదేమైనా సరే ఎవరిమట్టుకు వాళ్ళం వీలైనంత చేద్దాం. ఆ క్రమంలో ఎవరి తిట్టినా పడదాం. ఈసడించినా, అసహ్యించుకున్నా, అవమానించినా భరిద్దాం. అననీ... మనవాళ్ళేగా... మన తోటివాళ్ళేగా... మన భారతీయులేగా... అని చేస్తున్న ప్రయత్నమే.... ఈ 'వాచకం' ఆవిర్భావం....
                ఈ 'వాచకం' జగమొండి. అసమర్ధ ప్రేలాపనలు, పిరికితనాన్ని భరించదు, సహించదు. అమాయకత్వాన్ని అక్కున చేర్చుకుంటుంది. ఆదరిస్తుంది. తీర్చిదిద్దుతుంది. సమాజం ముందు సగర్వంగా నిలబెడుతుంది. మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, ప్రపంచం గురించిన సమాచారాన్ని మీకందిస్తుంది. మీ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. లోకంలోని విషయాలన్నింటినీ ఏకరువు పేట్టి భవిష్యత్తులో మీరు పయనించవలసిన మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా అధిగమించాలో మీకు నేర్పుతుంది. మీ సూచనలని, సలహాలను పాటిస్తుంది....
               ఒక మిత్రుడిలా మీకు తోడై నిలుస్తుంది... 

                                                                                             ...ఎడిటర్